Sunday, October 22, 2006

పల్లె…ఒక విడువని మోహం

నా శరీరాన్ని గదిలో పారేసి
నా ఆలోచనలతో పారిపోతాను
ఎన్ని స్వప్నాలను పారేసుకున్నాను
కాంక్రీటు గోడలమధ్య
హిపోక్రసీ నవ్వుల మధ్య
విరబూసిన సినీతార చిర్నవ్వు టిక్కెట్ల మధ్య
ఎన్ని స్వప్నాలను సాయంత్రపు కల్తీమాటల మధ్య అణిచేసాను
ఒక్కో స్వప్నాన్ని వెతుక్కుంటూ
పచ్హని పొలాల మధ్యలోకి
పొగచూరిన పల్లె గోడల పగుళ్ళలోకి దూకుతాను
కల్తీ తెలీని పంటకాలువ గలగలలో తేలిపోతాను
పల్లె ఙ్ఞాపకాల చేయి పట్టుకొని నిన్నటి వైపు నడచిపోతాను
అర్ధరాత్రి రెండో ఆట హార్రర్ సినిమా చూసిన రోడ్డు తటపటాయింపులులేని
మట్టి రోడ్డు మీద దూరంగా వినిపించే
యెద్దులబండి గజ్జెల చప్పుడు ఆప్యాయతతో పలకరిస్తుంది
పల్లెతల్లి పచ్చని చేల చీరంచుతో స్వాగతం చెప్తుంది
పసితనపు ఛాయలు పోని పల్లె అమాయకంగా నవ్వేస్తుంది కందిచేల గలగలలా
వంపులు తిరిగిన కాలువ ఇంకా గుర్తున్నానా అంటూ ప్రశ్నిస్టూన్నట్లే వుంతుంది
ఒక్కసారిగా వళ్ళు తడుపుకోవాలనిపిస్టుంది
కళ్ళు తుడుచుకోవాలనిపిస్తుంది
రూపాయల్లో కొంటున్న నీల్లుఙ్ఞాపకమొచ్చి మొహం తిప్పుకొంటాను
కాలువ చుట్టూ ఙ్ఞాపకాలు నడిచొస్తుంటే
పలకరించలేక గొంతు మూగవోతుంది
పెద్దవాళ్ళ అరుపులు, చొప్పదంట్లమోతలు నుంచి
ఆటవిడుపు కాలువ అలల లాలింపులోనే దొరికేది
మా నగ్నత్వాన్ని ఒడ్డున పెట్టి కాలువ ఒడిలో కరిగిపోయేవాళ్ళం
ఇప్పుడేమి మిగిలిందని...
ఎప్పటి ఙ్ఞాపకాలు ...
కోడిపుంజు కొక్కొరొకో మేలులొలుపులు,
తెల్లారగట్ల కావిల్ల చప్పుల్లతో పల్లె నిద్ర ముసుగు తీస్తుంది
తెల్లారి తెల్లారంగనే పల్లె కళ్ళాపి స్నానాలు చేస్తుంది
పడుచు పిల్లల చేతుల్లో ముగ్గులందాలద్దుకొని పల్లె ముసిముసిగా నవ్వుతుంది
పల్లె ఎప్పుడూ నవ్వుతుంది
చిన్నపిల్లల చిర్నవ్వులలో కాకరపువ్వొత్తులు పూస్తున్నప్పుడు
క్రొత్తగా వచ్చిన వోణీ తెచ్చే కలలు మొగ్గతొడుగుతున్నప్పుడు పల్లె నవ్వుతుంది
పంటలన్నీ చేతికొచ్చి ధాన్యం తూర్పారపడుతున్నప్పుడు
పల్లె రంగు రంగుల గాలిపటమై ఎగురుతుంది
పెద్దాళ్ళ నీతిబోధలకు పడుచుకుర్రాళ్ళ పొగరుబోతు ఆత్మవిశ్వాసాలకు మధ్య
పల్లె సాక్షిగా మిగిలిపోతుంతుంది
పల్లె నవ్వడమేకాదు కన్నీరెడ్తుంది కూడా
నిన్నంతా చుక్కల వోణీలో తనచుట్టూ తిరిగిన చిన్నది పట్టుచీరతో అత్తారింటికెళ్తున్నప్పుడు
వీడ్కోలు చెబ్తూ కన్నీరెడ్తుంది
పల్లె ఙ్ఞాపకాలు తెచ్చే కన్నీటితో హృదయం బరువెక్కుతుంది
పల్లెపాటలు..ఎప్పటికీపాడుబడవనివై నాలో ఎన్నెన్నో రాగాలు...

- మల్లవరపు ప్రభాకరరావు
(1996)

0 Comments:

Post a Comment

<< Home