Tuesday, December 05, 2006

మల్లవరపు జాన్ కవిత్వంలో మాధుర్యం! ' దార్ల వ్యాసం

Thursday, November 30, 2006

కొన్ని అభిప్రాయాలు!

radhika said...
good work.
unique speck said...
awesome!
unique speck said...
ఈ తుమ్మచెట్ల మనసెప్పుడు కరుగుద్దో? అసలు మనసుంటే కదా వాటికి! వాటికి ఈ గతి పడితే అడివంతా వినపడేటట్లు గగ్గోలు పెడతాయి...నరికి పోగులు పెట్ట!కదిలించి కరిగించి కన్నీరొలికించిన కవిత...

Saturday, November 18, 2006

తలపు

తేనెలూరు తెల్గుతీరు గనుంగొన(

గోర్కి వొడమువారు;కుంటి నడక

లేని కైత సౌరు గాన వేడుక సేయు

వారు;కనుడు-మల్లవరపు( గృతిని#

యతులు ప్రాస లప్రయత్నమ్ముగా వచ్చి

కుదురు కొంట మెచ్చుకొంద్రు బుధులు;

’మల్లవరపు జాను’ బల్లిదు( డీ జగా

నేర్మియందు బాస పేర్మియందు#

జాతి నలరించు నుడికార మే తదీయ

కవితకున్ మేలి తొడవు;సంఘమును దిద్దు

చూపుతో నిది పయనించు;సూనృతమ్ము

పలుక వెఱువదు-మఱవదు పడి తెఱ( గు#

జానువంటి కవులు జాను( దెనుంగుతో

సంతరింప వలయు సత్కవిత్వ;

మాంధ్రి నిక్కమైన యందముతోడ నూ

రేగవలయు నాట నెల్ల యెడల#


-"అభినవ తిక్కన,తెలుగు లెంక"
తుమ్మల సీతారామమూర్తి
(సెప్టెంబరు 1981)

Thursday, November 16, 2006

మా తాత

మా తాత సెప్తాఉంటె
పాత కధలన్నీ గల్ల తొట్టిలో
నానిన తోలవుద్ది


మా తాత వగలమారి కధల్ని సెప్తావుంటె
కల్ల మెరుపు సూడాలి
మా అవ్వ పచ్చడి ముద్దల ప్రేమను
తాగిన అల్లరి అగుపడుద్ది

మా తాతకి మోసాలూ,మాయాలూ తెలీవు
మా తాత మాటిచ్చాడంటే
మల్లెమొగ్గల్లాంటి కొత్త చెప్పులు కుట్టినంత గట్టింగుంటాడు

ఇన్ని ఇరిగిన ఎముకల చప్పుళ్ళు
ఇన్ని ముసిరిన చీకట్లు తర్వాత
మా తాత నవ్వుతాంటే
అగ్రకులాన్ని వెలేస్తూ దూరంగా వెళ్ళిన ఙ్ఞాపకం
నిజమే మా తాతకూ అభిమానం ఉంది
అల్లంత దూరాన్నే అయ్యోర్ల ఆంకారాన్ని నిలేయడమంటే
తస్సదియ్య! మా తాత మీసాన్ని మెలేయడా అంటే మెలేయడా మరి

మా తాత జాతర్లో తప్పెట దరువేస్తుంటే
అవమానపు తెట్టును ఏరేసిన వేళ్ళ చురుకు వినిపిస్తది
కానీ ఇప్పుడు మా తాత కళ్ళెర్ర చూస్తే చూడాలనిఉంది
ఊరికీ వాడకీ మధ్య గీతేసినోడి మూలాన్ని వెదికేందుకు

-మల్లవరపు ప్రభాకరరావు
(1996)

పాతకాలపు మనిషి


వర్తమానం బరువెక్కినప్పుడు
ఙ్ఞాపకాల్ని తడుముకోవడమే మిగిలింది
అస్తమానమూ అసమానతలు గురించి గొంత్తెత్తిమాట్లాడే కోడలుకు
అత్త అసహాయత మాత్రం అలుసవుతుంది
తన కడుపు కాల్చుకుని వెలిగించిన బిడ్డ తందాన వంతగాడయ్యాడు
అయినా మన బంగారం మంచిదవాలిగా-
అమ్మ ఇప్పుడొక అక్కర్లేని అవశేషం
తొలగించుకోవడానికి వెయ్యిన్నొక్కసార్లు నొసలు చిట్లించడం
మనసు ముక్కలవడానికి మాటలే ఈటెలు
నిజమే తండ్రీ! అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలనాడా
ఆదరాబాదరగ ఆకలి తీర్చాలని ఊదునుగొట్టంతో ఊపిరి చివరిదాకా ఊది
పొయ్యి కింది పిల్లిని తోలిన అమ్మ
ఊపిరి తీసుకోవడానికిప్పుడు మాటలే కరువు
పచ్చి పుండై పొలాన్నించి వచ్చి పిల్లాడి నవ్వు కోసం
పేదరాసి పెద్దమ్మ కధల్ని సృష్టించిన అమ్మకు
పచ్చ నోట్ల మోహంలో మునిగిన తనయుని తన్మయత్వం ఒక వింతే!
అమ్మకు కావల్సింది మాటల మబ్బులే కాని ఎడారి నిశ్శబ్దం కాదు
రచ్చబండ మీద,చేలగట్లపైన,చెరువుకట్ట మీద
ఊరి పలకరింపులో తడిసిన అమ్మ
ఈ విశాల గదుల మధ్య ఇరుకు హృదయాల వాస్తవాన్ని
అంగీకరించలేకపోతున్న చాదస్తురాలే!
పేదరికం బరువు కాలేదు
ఇంటి మగోడి చావు దుఖం కల్గించలేదు
అన్నింటికీ మించి బ్రతుకులో ఆశ చావలేదు
కానీ కుంచించుకు పోతున్న కుమారుని హృదయాన్ని మాత్రం భరించలేకపోతుంది
ప్రతిదీ నీకేమీ తెలియదు అంటున్న కొడుకుకు
ఏమీ తెలియకనే ఇంతవాడ్ని చేసిన అమ్మ కళ్ళలోని బేలతనం కనిపించని పొరలు కమ్మేశాయి
అక్షరాలు ఐశ్వర్యాన్నిస్తాయనుకుందిగానీ
అమ్మను దూరంగా ఉంచే విద్యలు నేర్పిస్తాయనుకోలేదు
అమ్మ పాతకాలపు మనిషి
అమ్మది పెద్ద మనస్సు
అసింటగా ఉంచినా ఆశీస్సులే ఇస్తుంది కానీ..
తల్లుల్లారా!మీ ఆడపిల్లలకు బోధించండి
అత్త కూడా అమ్మలాంటిదేనని
అమ్మను ప్రేమించలేనివాడు ఆలినీ ప్రేమించలేడనీ


-మల్లవరపు ప్రభాకరరావు
(అక్టోబర్ 13,2004)

Wednesday, November 15, 2006

నక్కల వాగు

ఎన్నెల్లో సెందురుడు
సుక్కలెలుగులు
పిల్లగాలి పలకరింపుల కలలేటికి తండ్రీ!
చెమట చుక్కల్ని
గంజిమెతుకులుగా మార్చుకోవడానికి
గానుగెద్దులైటోల్లకి
బువ్వ దొరకటమే పంచనచ్చత్తరాల కలఅప్పుడెప్పుడో అయ్య చేసిన అప్పుకు
ఆదీ లేదు అంతం లేదు


అంగిలెండిన చంటోడికి
అమ్మ ఆకలి తెలీదు


వయసొచ్చిన పిల్లమానం
సుబ్బులప్ప కోకను వోణీ గుడ్డలుగా చేసింది


అచ్చరం ముక్క లేదు
అంగుళం భూమి లేదు
మా ఆడోళ్ళనాగం చేయడానికి
ఆసామిగోరి పొలాలు ఆడ్నించి ఈడికినడుము నిలవనంటున్నా
బిచ్చాలు తాత పొగమొక్కలకి పోతానంటాడు
ఏందియా బో వొగుసోడిలా
కావిళ్ళకు పోతుండావంటే
ఊరికే కూకుంటే
ముద్దేడినించొత్తాదిరా అనెటోడు
మెతుకుకు మూరెడు దూరం బతుకులు
అంగిట్లో ముద్దకోసమే బతుకంతా యాగీ
ఆకలి పోరాటంలో అలసి
నక్కలోగుకి పోయినప్పుడు
లచ్చుమవ్వ ఏరై పొంగింది
వాగొడ్డున నిలేసుకున్న తుమ్మ చెట్లు మాత్రం
ఇదంతా మామూలే అన్నట్లు
తలలాడిస్తున్నాయి


-మల్లవరపు ప్రభాకరరావు
(1998)

మధ్యాహ్న కవిభానూ! మల్లవరపు జానూ!

"పండుటాకు భువినిరాలి పడుచునుండ
చిన్న చివురాకు తలయెత్తుచున్న పగిది"(ఇది మీ కవితే)


ఎదుగుతున్న మీ పలుకును చూస్తూవుంటే
ఇరుగట్టులను ఒరుసుకొని పారే
మీ ఝరీ కవితను గమనిస్తూవుంటే-
ఎంత ఆనందం కలిగిందో చెప్పనా?
ఆత్మీయుడు జాషువా వచ్చి
నా గుండెను తడుతున్నాడా
అనిపించింది-


ఆ కాల్పనిక సత్యానికి
నా మనసు పుటలను
విశద సాక్షులుగా విప్పనా?


-డాక్టర్ సి.నారాయణ రెడ్డి
(1981)

శ్రీ వాణి

పనస తొనలకన్న పాలమీగడకన్న
మధువుకన్న ముగ్ధ వధువుకన్న
మల్లవరపు కవిత మధురాతి మధురమ్ము
"జాను" తెనుగు మేలి "జాను తెనుగు"భావమునకు తగిన పదములన్నియు వచ్చి
అందమైన ఛందమందు నొదిగి
పరమ హృద్యమైన పద్యమ్ముగా మారు
"జాను" తెనుగు మేలి "జాను తెనుగు"మలయ మారుతములు పలుకరించిన యట్లు
ప్రేమ సుధలు చిలుకరించినట్లు
పుడమితల్లి గుండె పులకరించినయట్లు
"జాను" తెనుగు మేలి "జాను తెనుగు
"

-"కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి
(సెప్టెంబరు 1981)

Wednesday, November 01, 2006

డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరవు మాటల్లో …

ఫ్రకాశం జిల్లా కవిత్వ చరిత్రలో మల్లవరపు కవులదొక మథురాధ్యాయం.జాన్ పరిణితి చెందిన పద్యకవి.వారి కొడుకు రాజేశ్వరరావు పద్యం, గేయం రెంటి మీద పట్టు సాధించిన సహజకవి.వారి కొడుకు ప్రభాకర్ ఇప్పిడిప్పుడే నిప్పులు చెరుగుతూ కవితాలోకం తనవేపు చూచేట్టు చేసుకొంటున్న వర్తమాన వర్ధమాన వచనకవితా యువకవి. .ప్రభాకరరావు రాసింది దోసెడు కవితలే!అయినా ప్రతి కవితా ప్రభాభాసురం!ప్రతిపాదం ప్రతిభాస్వరం!
"ఒకానొక నిషిధ్ధ ప్రాంతంలో
వ్యక్తాలన్నీ అవ్యక్తమై
కత్తిమొన అంచున బందీలై ఉంటాయి
ఒకానొక నిషిధ్ధ ప్రాంతంలో స్వప్నాలన్నీ సత్యాలుగా
ఆవిష్కరించుకోకుండానే అదృశ్యమవుతాయి" నిషిధ్ధప్రాంతం అనే కవితలో ఆ పదబంధం పునరుక్తి చెయ్యడం వల్ల బలమైన కవిత్వనిర్మాణం జరిగింది
అబధ్ధాలు వినీ వినీ అవే నిజాలని నమ్మిన అమాయకపు ప్రజానీకం గూర్చి తలపోస్తూ ప్రభాకర్
"జారిపోతున్న నమ్మకాన్ని ఏఆశలతోనో పట్టుకోవాలని మనిషి రంగులను వెదజల్లుతున్నాడు"అంటాడు.
అవన్నీ సింధటిక్ రంగులని ప్రకౄతి సిధ్ధమైన పరిమళభరితాలు కావని కవితాత్మకంగా కలం కదుపుతాడు
అభివ్యక్తి విషయంలో కూడా ఈ కవి జాగ్రత్తను ప్రదర్శిస్తున్నాడు
"జెండా కొయ్యలు జెండాలపై తిరగపడుతున్నాయి
పిసకబడ్డ గొంతు పిడికిలై బిగుసుకుంటుంది" నిజానికి ఈరెండో పాదం లేకపోయినా కవిత్వం చిక్కగనే ఉంటుంది!
"రాబందులు జూబ్లీహిల్స్ నడిరోడ్డు మీద చేసిన చప్పుడుకు
హుస్సేన్ సాగర్ అలలు బెదిరి బుధ్ధుని పాదాలు తాకాయి"
నగరంలో విషాదం అలముకొన్న సందర్భాన్ని సామాన్యుల నిస్సహాయతని ఆవిష్కరిస్తూ చెప్పిన ఈ అక్షరాలు అతని కవిత్వ శిల్ప అవగాహనకి సాక్ష్యం చెబుతాయి.
"వాడెప్పుడూ అంతే
నీ చెమట చుక్కల్ని చెక్కుబుక్కులుగా మార్చుకుని
రెండేళ్ళకో,ఐదేళ్ళకో
అచ్చు నీలాగే పలుగూపార పడతాడు
పత్రికలో నీ ప్రతినిధిగా అచ్చేసుకుంటాడు" సమకాలీన రాజకీయాలపై స్పష్టమైన అవగాహన గల ఈ కవి రాసిన పంక్తులివి
ప్రభాకర్ కి తాను ఆవిష్కరించే వస్తువు మీద అన్ని కోణాల నుంచి అవగాహన ఉంటుంది.కవిత్వాన్ని జీవితమంత సీరియస్ తీసుకొనే కొద్దిమంది కవుల్లో ప్రభాకర్ ఒకడు.ఆవేశాన్ని ఆలోచనతో మధించి,అమృతాన్ని పంచిపెట్టగల అంతరంగం ఉంది.సామాజిక ఆర్ధికాంశాలపై సదవగాహన గల ఈ యువకవి తన పరిధిని విశాలతరం చేసుకోవాలి.సమకాలీన భాషల్లో వస్తున్న వైవిధ్య భరితమైన కవిత్వాన్ని పఠించాలి.అప్పుడు భవిష్యత్ పత్రంపై ప్రస్పుటమైన కవితాసంతకం చేయగలడు.
(వార్త ఆదివారం 18/02/2001)

సింధటిక్ రంగులు

జారిపోతున్న నమ్మకాన్ని
ఏ ఆశలతోనో పట్టుకోవాలని
మనిషి రంగులను వెదజల్లుతున్నాడు
అన్నీ వెలసిపోయిన రంగులే
నవ్వులను రువ్వలేనప్పుడు
ఏ రంగు మాత్రం కాంతిగా ఉంటుంది


అబధ్ధాలు వినీ వినీ అవే నిజాలని నమ్మి
ఇప్పుడు అనాలోచితంగా
రంగులు విసురుతున్నాడు
ఆశలను మొలకెత్తించలేనప్పుడు
ఏరంగు మాత్రం కంటిలో పూలు పూయించగలదు


మనిషి ఒంటరితనంలోకి జారిపోతున్నాడు
అమ్మను,అమృతత్వాన్ని
ఊరి మధ్య వేపచెట్టునూ వదిలేసి వేరుకుంపటి పెట్టుకుంటున్నాడు

కళ్ళ ముందు కాసుల గలగలలు వినిపిస్తున్నా
కళ్ళలో విస్తరిస్తున్న నైరాశ్యపు నీడల మధ్య
అస్పష్టమైన రంగులతో ఇంధ్రధనుస్సు సౄష్టించుకోవాలనుకుంటున్నాడు
పచ్చని నేలను కౌగిలించుకోలేనప్పుడు
హృదయమెప్పుడూ ఎండిన బీడే
ఎన్ని రంగులున్నా
ఏటిపక్కన పూచే మందారపు ఎరుపేది?
ఎన్ని రంగులున్నా
పెరటి ముద్దబంతి పసుపేది?
వేపపూత ఆకుపచ్చేది?
నిద్రగన్నేరు పూల రంగేది?
అన్నీ సింధటిక్ రంగులు
రాత బల్ల మీద అమర్చిన కాగితప్పూల వెలిసిపొయిన రంగులు
ఈ రంగులు రాగాలు వినిపించలేవు
ఈ రంగులు ఆశలను చిగురింపలేవు
ఈ రంగులు జీవితాన్నివెలిగించలేవు
ఈ రంగుల్తో ఇంధ్రధనుస్సును సృష్టించలేము
- మల్లవరపు ప్రభాకరరావు
(1997)

Tuesday, October 24, 2006

ఒక రాత్రి

చీకట్లో దేవులాడుతూ..
ప్రియురాలి చుంబనం కోసం
ఎంతకీ విచ్చుకోని వెన్నెల
ఏమిటో నేలపై సన్నజాజులు రాలిన పరిమళం కూడా లేదు


చీకట్లో కళ్ళు తడుముతుంటాయి
కనపడని దానికోసమే సిధ్ధాంతాలు
పురివిప్పని నెమలి పింఛం కోసం
కళ్ళు పుస్తకాల్లొ వెదుకుతుంటాయి


తుంటరి కుక్క పిల్ల పైకెగిరే ఆనందంలో
ఎక్కడో చిక్కుకున్న గాలిపటాన్ని వెతికి తీయాలి


రాత్రయితే చాలు
వెలుగు పరుచుకోవాలి కదా
కనీసం మిణుగురు కాంతి కూడా లేదు
ఆమె కన్నుల్లో నిండిన కాంతిని
నాలోకి ఒంపుకోవడం చాతకావడం లేదు


హైద్రాబాదీ ఖవాలీ గీతాల్లో
విరహమై చీకటి నిండుతోంది
దోసిళ్ళతో తాగడానికి కవిత్వమొక్కటే సరిపోతుందా!


- మల్లవరపు ప్రభాకరరావు(2002)

ఒక వేసవి రాత్రి

పగలంతా మూసిఉంచిన గది
తెరిచీ తెరవంగనే ముక్కవాసన
ఏ పరిమళమూ స్వాగతించని గదిలోకి
నేనూ, నిశ్శబ్దమూ...


పరచిన చాప,చుట్టిన పరుపూ
ఛైతన్యరహితమై ఒక మెలాంకలీ గీతాన్ని వినిపిస్తుంది
దండానికి వేలాడుతున్న బట్టలన్నీ
అనంత శోకాన్ని ఉరేసినట్లుగా అనిపిస్తాయి
ఈ గది ఒక బాధాకర నిరీక్షణకు చిహ్నమైపోతుంది
ఒక సౌగంధికా పరీమళభరిత ఙ్ఞాపకాన్ని
ఆవాహన చేసుకొనే ఆనవాలు కనిపించని
ఒక శూన్య ప్రదేశాన్ని సౄష్టిస్తుంది

రాత్రి మరీను…
పగలంతా ఆఫీసు అలజడిలో అలసిన
నాకు ఈగది ఏ చిర్నవ్వు బహుమానమూ ఎదురవ్వని
దుఃఖాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది
కానీ ఈగది నాకు ఒక అనివార్య ప్రవేశం..
చుక్కలు చుక్కలుగా చప్పరించాల్సిన అనివార్యదుఃఖం...
ఈ వేసవి రాత్రి…
కిటికీకావల పరుచుకున్న వెన్నెల
వెన్నెల కురుస్తున్నట్లుగా లేదు
వెచ్చని నిట్టూర్పులు విడుస్తున్నట్లుగా వుంది
అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వీస్తున్న గాలి
కొబ్బరాకుల్లో చిక్కుకున్న నవ్వై నాలో ఙ్ఞాపకాల్ని గుచ్చుతుంది
ఇక్కడో ఆశ తన రెండుకళ్ళ దీపాల వెలుగులో ప్రతిబింబిస్తూ
నాలోనూ, నా గదిలోనూ సజీవ చైతన్యాన్ని నింపుతుంది

-మల్లవరపు ప్రభాకరరవు
(2002)

నిజం

కంట్లో నలుసు తొలిగిపోదు
వాన కురవని నేలల్లో
వాగ్దానం నెరవేరని బతుకుల్లో
నెర్రెలిచ్చిన నేలకు కన్నీళ్ళ మడులు


గంగిరెద్దు కొమ్ములకు
గుడ్డముక్కల తళుకులు
గురిచూసి విసిరే వల


దగాపడిన కాలువల కధలు కంచికిపోయి
నీతిబొట్టులేని పాపం ఇంకుడు గుంటలదవుతుంది


మోక్షమివ్వని పెద్దోళ్ళ తలపాగాల్లో
కుదేలయిన ప్రాణాలు
కొనఊపిరితో తొంగిచూస్తున్నాయి


బాకీబతుకులకి
చలనరహితమైన కాలం
దుఃఖోపశమనం అవుతుంది


ఫొద్దుపొడిచినా కానరాని
సూరీడి అలసత్వానికి
నిజం చింతచెట్టు నీడలో కలిసిపోయింది


-మల్లవరపు ప్రభాకరరవు
(2000)