Wednesday, November 01, 2006

సింధటిక్ రంగులు

జారిపోతున్న నమ్మకాన్ని
ఏ ఆశలతోనో పట్టుకోవాలని
మనిషి రంగులను వెదజల్లుతున్నాడు
అన్నీ వెలసిపోయిన రంగులే
నవ్వులను రువ్వలేనప్పుడు
ఏ రంగు మాత్రం కాంతిగా ఉంటుంది


అబధ్ధాలు వినీ వినీ అవే నిజాలని నమ్మి
ఇప్పుడు అనాలోచితంగా
రంగులు విసురుతున్నాడు
ఆశలను మొలకెత్తించలేనప్పుడు
ఏరంగు మాత్రం కంటిలో పూలు పూయించగలదు


మనిషి ఒంటరితనంలోకి జారిపోతున్నాడు
అమ్మను,అమృతత్వాన్ని
ఊరి మధ్య వేపచెట్టునూ వదిలేసి వేరుకుంపటి పెట్టుకుంటున్నాడు

కళ్ళ ముందు కాసుల గలగలలు వినిపిస్తున్నా
కళ్ళలో విస్తరిస్తున్న నైరాశ్యపు నీడల మధ్య
అస్పష్టమైన రంగులతో ఇంధ్రధనుస్సు సౄష్టించుకోవాలనుకుంటున్నాడు
పచ్చని నేలను కౌగిలించుకోలేనప్పుడు
హృదయమెప్పుడూ ఎండిన బీడే
ఎన్ని రంగులున్నా
ఏటిపక్కన పూచే మందారపు ఎరుపేది?
ఎన్ని రంగులున్నా
పెరటి ముద్దబంతి పసుపేది?
వేపపూత ఆకుపచ్చేది?
నిద్రగన్నేరు పూల రంగేది?
అన్నీ సింధటిక్ రంగులు
రాత బల్ల మీద అమర్చిన కాగితప్పూల వెలిసిపొయిన రంగులు
ఈ రంగులు రాగాలు వినిపించలేవు
ఈ రంగులు ఆశలను చిగురింపలేవు
ఈ రంగులు జీవితాన్నివెలిగించలేవు
ఈ రంగుల్తో ఇంధ్రధనుస్సును సృష్టించలేము
- మల్లవరపు ప్రభాకరరావు
(1997)

0 Comments:

Post a Comment

<< Home