Thursday, November 16, 2006

పాతకాలపు మనిషి


వర్తమానం బరువెక్కినప్పుడు
ఙ్ఞాపకాల్ని తడుముకోవడమే మిగిలింది
అస్తమానమూ అసమానతలు గురించి గొంత్తెత్తిమాట్లాడే కోడలుకు
అత్త అసహాయత మాత్రం అలుసవుతుంది
తన కడుపు కాల్చుకుని వెలిగించిన బిడ్డ తందాన వంతగాడయ్యాడు
అయినా మన బంగారం మంచిదవాలిగా-
అమ్మ ఇప్పుడొక అక్కర్లేని అవశేషం
తొలగించుకోవడానికి వెయ్యిన్నొక్కసార్లు నొసలు చిట్లించడం
మనసు ముక్కలవడానికి మాటలే ఈటెలు
నిజమే తండ్రీ! అడ్డాలనాడు బిడ్డలుగానీ గడ్డాలనాడా
ఆదరాబాదరగ ఆకలి తీర్చాలని ఊదునుగొట్టంతో ఊపిరి చివరిదాకా ఊది
పొయ్యి కింది పిల్లిని తోలిన అమ్మ
ఊపిరి తీసుకోవడానికిప్పుడు మాటలే కరువు
పచ్చి పుండై పొలాన్నించి వచ్చి పిల్లాడి నవ్వు కోసం
పేదరాసి పెద్దమ్మ కధల్ని సృష్టించిన అమ్మకు
పచ్చ నోట్ల మోహంలో మునిగిన తనయుని తన్మయత్వం ఒక వింతే!
అమ్మకు కావల్సింది మాటల మబ్బులే కాని ఎడారి నిశ్శబ్దం కాదు
రచ్చబండ మీద,చేలగట్లపైన,చెరువుకట్ట మీద
ఊరి పలకరింపులో తడిసిన అమ్మ
ఈ విశాల గదుల మధ్య ఇరుకు హృదయాల వాస్తవాన్ని
అంగీకరించలేకపోతున్న చాదస్తురాలే!
పేదరికం బరువు కాలేదు
ఇంటి మగోడి చావు దుఖం కల్గించలేదు
అన్నింటికీ మించి బ్రతుకులో ఆశ చావలేదు
కానీ కుంచించుకు పోతున్న కుమారుని హృదయాన్ని మాత్రం భరించలేకపోతుంది
ప్రతిదీ నీకేమీ తెలియదు అంటున్న కొడుకుకు
ఏమీ తెలియకనే ఇంతవాడ్ని చేసిన అమ్మ కళ్ళలోని బేలతనం కనిపించని పొరలు కమ్మేశాయి
అక్షరాలు ఐశ్వర్యాన్నిస్తాయనుకుందిగానీ
అమ్మను దూరంగా ఉంచే విద్యలు నేర్పిస్తాయనుకోలేదు
అమ్మ పాతకాలపు మనిషి
అమ్మది పెద్ద మనస్సు
అసింటగా ఉంచినా ఆశీస్సులే ఇస్తుంది కానీ..
తల్లుల్లారా!మీ ఆడపిల్లలకు బోధించండి
అత్త కూడా అమ్మలాంటిదేనని
అమ్మను ప్రేమించలేనివాడు ఆలినీ ప్రేమించలేడనీ


-మల్లవరపు ప్రభాకరరావు
(అక్టోబర్ 13,2004)

1 Comments:

Blogger GARAM CHAI said...

తెలుగు వారి కోసం సరికొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడినది
చూసి ఆనందించండి తెలుగు న్యూస్ మూవీ న్యూస్ ...

https://www.youtube.com/garamchai

3:52 AM  

Post a Comment

<< Home