Wednesday, November 15, 2006

నక్కల వాగు

ఎన్నెల్లో సెందురుడు
సుక్కలెలుగులు
పిల్లగాలి పలకరింపుల కలలేటికి తండ్రీ!
చెమట చుక్కల్ని
గంజిమెతుకులుగా మార్చుకోవడానికి
గానుగెద్దులైటోల్లకి
బువ్వ దొరకటమే పంచనచ్చత్తరాల కల



అప్పుడెప్పుడో అయ్య చేసిన అప్పుకు
ఆదీ లేదు అంతం లేదు


అంగిలెండిన చంటోడికి
అమ్మ ఆకలి తెలీదు


వయసొచ్చిన పిల్లమానం
సుబ్బులప్ప కోకను వోణీ గుడ్డలుగా చేసింది


అచ్చరం ముక్క లేదు
అంగుళం భూమి లేదు
మా ఆడోళ్ళనాగం చేయడానికి
ఆసామిగోరి పొలాలు ఆడ్నించి ఈడికి



నడుము నిలవనంటున్నా
బిచ్చాలు తాత పొగమొక్కలకి పోతానంటాడు
ఏందియా బో వొగుసోడిలా
కావిళ్ళకు పోతుండావంటే
ఊరికే కూకుంటే
ముద్దేడినించొత్తాదిరా అనెటోడు
మెతుకుకు మూరెడు దూరం బతుకులు
అంగిట్లో ముద్దకోసమే బతుకంతా యాగీ
ఆకలి పోరాటంలో అలసి
నక్కలోగుకి పోయినప్పుడు
లచ్చుమవ్వ ఏరై పొంగింది
వాగొడ్డున నిలేసుకున్న తుమ్మ చెట్లు మాత్రం
ఇదంతా మామూలే అన్నట్లు
తలలాడిస్తున్నాయి


-మల్లవరపు ప్రభాకరరావు
(1998)

1 Comments:

Anonymous Anonymous said...

ఈ తుమ్మచెట్ల మనసెప్పుడు కరుగుద్దో? అసలు మనసుంటే కదా వాటికి! వాటికి ఈ గతి పడితే అడివంతా వినపడేటట్లు గగ్గోలు పెడతాయి...నరికి పోగులు పెట్ట!

కదిలించి కరిగించి కన్నీరొలికించిన కవిత...

1:48 AM  

Post a Comment

<< Home