Wednesday, November 01, 2006

డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరవు మాటల్లో …

ఫ్రకాశం జిల్లా కవిత్వ చరిత్రలో మల్లవరపు కవులదొక మథురాధ్యాయం.జాన్ పరిణితి చెందిన పద్యకవి.వారి కొడుకు రాజేశ్వరరావు పద్యం, గేయం రెంటి మీద పట్టు సాధించిన సహజకవి.వారి కొడుకు ప్రభాకర్ ఇప్పిడిప్పుడే నిప్పులు చెరుగుతూ కవితాలోకం తనవేపు చూచేట్టు చేసుకొంటున్న వర్తమాన వర్ధమాన వచనకవితా యువకవి. .ప్రభాకరరావు రాసింది దోసెడు కవితలే!అయినా ప్రతి కవితా ప్రభాభాసురం!ప్రతిపాదం ప్రతిభాస్వరం!
"ఒకానొక నిషిధ్ధ ప్రాంతంలో
వ్యక్తాలన్నీ అవ్యక్తమై
కత్తిమొన అంచున బందీలై ఉంటాయి
ఒకానొక నిషిధ్ధ ప్రాంతంలో స్వప్నాలన్నీ సత్యాలుగా
ఆవిష్కరించుకోకుండానే అదృశ్యమవుతాయి" నిషిధ్ధప్రాంతం అనే కవితలో ఆ పదబంధం పునరుక్తి చెయ్యడం వల్ల బలమైన కవిత్వనిర్మాణం జరిగింది
అబధ్ధాలు వినీ వినీ అవే నిజాలని నమ్మిన అమాయకపు ప్రజానీకం గూర్చి తలపోస్తూ ప్రభాకర్
"జారిపోతున్న నమ్మకాన్ని ఏఆశలతోనో పట్టుకోవాలని మనిషి రంగులను వెదజల్లుతున్నాడు"అంటాడు.
అవన్నీ సింధటిక్ రంగులని ప్రకౄతి సిధ్ధమైన పరిమళభరితాలు కావని కవితాత్మకంగా కలం కదుపుతాడు
అభివ్యక్తి విషయంలో కూడా ఈ కవి జాగ్రత్తను ప్రదర్శిస్తున్నాడు
"జెండా కొయ్యలు జెండాలపై తిరగపడుతున్నాయి
పిసకబడ్డ గొంతు పిడికిలై బిగుసుకుంటుంది" నిజానికి ఈరెండో పాదం లేకపోయినా కవిత్వం చిక్కగనే ఉంటుంది!
"రాబందులు జూబ్లీహిల్స్ నడిరోడ్డు మీద చేసిన చప్పుడుకు
హుస్సేన్ సాగర్ అలలు బెదిరి బుధ్ధుని పాదాలు తాకాయి"
నగరంలో విషాదం అలముకొన్న సందర్భాన్ని సామాన్యుల నిస్సహాయతని ఆవిష్కరిస్తూ చెప్పిన ఈ అక్షరాలు అతని కవిత్వ శిల్ప అవగాహనకి సాక్ష్యం చెబుతాయి.
"వాడెప్పుడూ అంతే
నీ చెమట చుక్కల్ని చెక్కుబుక్కులుగా మార్చుకుని
రెండేళ్ళకో,ఐదేళ్ళకో
అచ్చు నీలాగే పలుగూపార పడతాడు
పత్రికలో నీ ప్రతినిధిగా అచ్చేసుకుంటాడు" సమకాలీన రాజకీయాలపై స్పష్టమైన అవగాహన గల ఈ కవి రాసిన పంక్తులివి
ప్రభాకర్ కి తాను ఆవిష్కరించే వస్తువు మీద అన్ని కోణాల నుంచి అవగాహన ఉంటుంది.కవిత్వాన్ని జీవితమంత సీరియస్ తీసుకొనే కొద్దిమంది కవుల్లో ప్రభాకర్ ఒకడు.ఆవేశాన్ని ఆలోచనతో మధించి,అమృతాన్ని పంచిపెట్టగల అంతరంగం ఉంది.సామాజిక ఆర్ధికాంశాలపై సదవగాహన గల ఈ యువకవి తన పరిధిని విశాలతరం చేసుకోవాలి.సమకాలీన భాషల్లో వస్తున్న వైవిధ్య భరితమైన కవిత్వాన్ని పఠించాలి.అప్పుడు భవిష్యత్ పత్రంపై ప్రస్పుటమైన కవితాసంతకం చేయగలడు.
(వార్త ఆదివారం 18/02/2001)