Thursday, November 16, 2006

మా తాత

మా తాత సెప్తాఉంటె
పాత కధలన్నీ గల్ల తొట్టిలో
నానిన తోలవుద్ది


మా తాత వగలమారి కధల్ని సెప్తావుంటె
కల్ల మెరుపు సూడాలి
మా అవ్వ పచ్చడి ముద్దల ప్రేమను
తాగిన అల్లరి అగుపడుద్ది

మా తాతకి మోసాలూ,మాయాలూ తెలీవు
మా తాత మాటిచ్చాడంటే
మల్లెమొగ్గల్లాంటి కొత్త చెప్పులు కుట్టినంత గట్టింగుంటాడు

ఇన్ని ఇరిగిన ఎముకల చప్పుళ్ళు
ఇన్ని ముసిరిన చీకట్లు తర్వాత
మా తాత నవ్వుతాంటే
అగ్రకులాన్ని వెలేస్తూ దూరంగా వెళ్ళిన ఙ్ఞాపకం
నిజమే మా తాతకూ అభిమానం ఉంది
అల్లంత దూరాన్నే అయ్యోర్ల ఆంకారాన్ని నిలేయడమంటే
తస్సదియ్య! మా తాత మీసాన్ని మెలేయడా అంటే మెలేయడా మరి

మా తాత జాతర్లో తప్పెట దరువేస్తుంటే
అవమానపు తెట్టును ఏరేసిన వేళ్ళ చురుకు వినిపిస్తది
కానీ ఇప్పుడు మా తాత కళ్ళెర్ర చూస్తే చూడాలనిఉంది
ఊరికీ వాడకీ మధ్య గీతేసినోడి మూలాన్ని వెదికేందుకు

-మల్లవరపు ప్రభాకరరావు
(1996)

0 Comments:

Post a Comment

<< Home