Tuesday, October 24, 2006

ఒక రాత్రి

చీకట్లో దేవులాడుతూ..
ప్రియురాలి చుంబనం కోసం
ఎంతకీ విచ్చుకోని వెన్నెల
ఏమిటో నేలపై సన్నజాజులు రాలిన పరిమళం కూడా లేదు


చీకట్లో కళ్ళు తడుముతుంటాయి
కనపడని దానికోసమే సిధ్ధాంతాలు
పురివిప్పని నెమలి పింఛం కోసం
కళ్ళు పుస్తకాల్లొ వెదుకుతుంటాయి


తుంటరి కుక్క పిల్ల పైకెగిరే ఆనందంలో
ఎక్కడో చిక్కుకున్న గాలిపటాన్ని వెతికి తీయాలి


రాత్రయితే చాలు
వెలుగు పరుచుకోవాలి కదా
కనీసం మిణుగురు కాంతి కూడా లేదు
ఆమె కన్నుల్లో నిండిన కాంతిని
నాలోకి ఒంపుకోవడం చాతకావడం లేదు


హైద్రాబాదీ ఖవాలీ గీతాల్లో
విరహమై చీకటి నిండుతోంది
దోసిళ్ళతో తాగడానికి కవిత్వమొక్కటే సరిపోతుందా!


- మల్లవరపు ప్రభాకరరావు(2002)

ఒక వేసవి రాత్రి

పగలంతా మూసిఉంచిన గది
తెరిచీ తెరవంగనే ముక్కవాసన
ఏ పరిమళమూ స్వాగతించని గదిలోకి
నేనూ, నిశ్శబ్దమూ...


పరచిన చాప,చుట్టిన పరుపూ
ఛైతన్యరహితమై ఒక మెలాంకలీ గీతాన్ని వినిపిస్తుంది
దండానికి వేలాడుతున్న బట్టలన్నీ
అనంత శోకాన్ని ఉరేసినట్లుగా అనిపిస్తాయి
ఈ గది ఒక బాధాకర నిరీక్షణకు చిహ్నమైపోతుంది
ఒక సౌగంధికా పరీమళభరిత ఙ్ఞాపకాన్ని
ఆవాహన చేసుకొనే ఆనవాలు కనిపించని
ఒక శూన్య ప్రదేశాన్ని సౄష్టిస్తుంది

రాత్రి మరీను…
పగలంతా ఆఫీసు అలజడిలో అలసిన
నాకు ఈగది ఏ చిర్నవ్వు బహుమానమూ ఎదురవ్వని
దుఃఖాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది
కానీ ఈగది నాకు ఒక అనివార్య ప్రవేశం..
చుక్కలు చుక్కలుగా చప్పరించాల్సిన అనివార్యదుఃఖం...
ఈ వేసవి రాత్రి…
కిటికీకావల పరుచుకున్న వెన్నెల
వెన్నెల కురుస్తున్నట్లుగా లేదు
వెచ్చని నిట్టూర్పులు విడుస్తున్నట్లుగా వుంది
అప్పుడప్పుడూ తెరలు తెరలుగా వీస్తున్న గాలి
కొబ్బరాకుల్లో చిక్కుకున్న నవ్వై నాలో ఙ్ఞాపకాల్ని గుచ్చుతుంది
ఇక్కడో ఆశ తన రెండుకళ్ళ దీపాల వెలుగులో ప్రతిబింబిస్తూ
నాలోనూ, నా గదిలోనూ సజీవ చైతన్యాన్ని నింపుతుంది

-మల్లవరపు ప్రభాకరరవు
(2002)

నిజం

కంట్లో నలుసు తొలిగిపోదు
వాన కురవని నేలల్లో
వాగ్దానం నెరవేరని బతుకుల్లో
నెర్రెలిచ్చిన నేలకు కన్నీళ్ళ మడులు


గంగిరెద్దు కొమ్ములకు
గుడ్డముక్కల తళుకులు
గురిచూసి విసిరే వల


దగాపడిన కాలువల కధలు కంచికిపోయి
నీతిబొట్టులేని పాపం ఇంకుడు గుంటలదవుతుంది


మోక్షమివ్వని పెద్దోళ్ళ తలపాగాల్లో
కుదేలయిన ప్రాణాలు
కొనఊపిరితో తొంగిచూస్తున్నాయి


బాకీబతుకులకి
చలనరహితమైన కాలం
దుఃఖోపశమనం అవుతుంది


ఫొద్దుపొడిచినా కానరాని
సూరీడి అలసత్వానికి
నిజం చింతచెట్టు నీడలో కలిసిపోయింది


-మల్లవరపు ప్రభాకరరవు
(2000)

Sunday, October 22, 2006

అమ్మప్రేమ

నీ కళ్ళ కదలికల్లో వెన్నెల చల్లదనం చూస్తూ
నీ అడుగుల సవ్వడిలో సెలయేటి గలగలలు వింటూ
నీ చిర్నవ్వు మెరుపులో అనంత సౌందర్యాన్ని అనుభవిస్తూ
నిన్ను నాహృదయానికి హత్తుకుంటాను
కన్నా!
ఫ్రేమంటే రక్తాన్ని స్తన్యంగా మార్చడమే కదూ
మాతృత్వపు మధురిమతో నీకు జోలపాడడమే కదూ…


-మల్లవరపు ప్రభాకరరావు
(1996)

పల్లె…ఒక విడువని మోహం

నా శరీరాన్ని గదిలో పారేసి
నా ఆలోచనలతో పారిపోతాను
ఎన్ని స్వప్నాలను పారేసుకున్నాను
కాంక్రీటు గోడలమధ్య
హిపోక్రసీ నవ్వుల మధ్య
విరబూసిన సినీతార చిర్నవ్వు టిక్కెట్ల మధ్య
ఎన్ని స్వప్నాలను సాయంత్రపు కల్తీమాటల మధ్య అణిచేసాను
ఒక్కో స్వప్నాన్ని వెతుక్కుంటూ
పచ్హని పొలాల మధ్యలోకి
పొగచూరిన పల్లె గోడల పగుళ్ళలోకి దూకుతాను
కల్తీ తెలీని పంటకాలువ గలగలలో తేలిపోతాను
పల్లె ఙ్ఞాపకాల చేయి పట్టుకొని నిన్నటి వైపు నడచిపోతాను
అర్ధరాత్రి రెండో ఆట హార్రర్ సినిమా చూసిన రోడ్డు తటపటాయింపులులేని
మట్టి రోడ్డు మీద దూరంగా వినిపించే
యెద్దులబండి గజ్జెల చప్పుడు ఆప్యాయతతో పలకరిస్తుంది
పల్లెతల్లి పచ్చని చేల చీరంచుతో స్వాగతం చెప్తుంది
పసితనపు ఛాయలు పోని పల్లె అమాయకంగా నవ్వేస్తుంది కందిచేల గలగలలా
వంపులు తిరిగిన కాలువ ఇంకా గుర్తున్నానా అంటూ ప్రశ్నిస్టూన్నట్లే వుంతుంది
ఒక్కసారిగా వళ్ళు తడుపుకోవాలనిపిస్టుంది
కళ్ళు తుడుచుకోవాలనిపిస్తుంది
రూపాయల్లో కొంటున్న నీల్లుఙ్ఞాపకమొచ్చి మొహం తిప్పుకొంటాను
కాలువ చుట్టూ ఙ్ఞాపకాలు నడిచొస్తుంటే
పలకరించలేక గొంతు మూగవోతుంది
పెద్దవాళ్ళ అరుపులు, చొప్పదంట్లమోతలు నుంచి
ఆటవిడుపు కాలువ అలల లాలింపులోనే దొరికేది
మా నగ్నత్వాన్ని ఒడ్డున పెట్టి కాలువ ఒడిలో కరిగిపోయేవాళ్ళం
ఇప్పుడేమి మిగిలిందని...
ఎప్పటి ఙ్ఞాపకాలు ...
కోడిపుంజు కొక్కొరొకో మేలులొలుపులు,
తెల్లారగట్ల కావిల్ల చప్పుల్లతో పల్లె నిద్ర ముసుగు తీస్తుంది
తెల్లారి తెల్లారంగనే పల్లె కళ్ళాపి స్నానాలు చేస్తుంది
పడుచు పిల్లల చేతుల్లో ముగ్గులందాలద్దుకొని పల్లె ముసిముసిగా నవ్వుతుంది
పల్లె ఎప్పుడూ నవ్వుతుంది
చిన్నపిల్లల చిర్నవ్వులలో కాకరపువ్వొత్తులు పూస్తున్నప్పుడు
క్రొత్తగా వచ్చిన వోణీ తెచ్చే కలలు మొగ్గతొడుగుతున్నప్పుడు పల్లె నవ్వుతుంది
పంటలన్నీ చేతికొచ్చి ధాన్యం తూర్పారపడుతున్నప్పుడు
పల్లె రంగు రంగుల గాలిపటమై ఎగురుతుంది
పెద్దాళ్ళ నీతిబోధలకు పడుచుకుర్రాళ్ళ పొగరుబోతు ఆత్మవిశ్వాసాలకు మధ్య
పల్లె సాక్షిగా మిగిలిపోతుంతుంది
పల్లె నవ్వడమేకాదు కన్నీరెడ్తుంది కూడా
నిన్నంతా చుక్కల వోణీలో తనచుట్టూ తిరిగిన చిన్నది పట్టుచీరతో అత్తారింటికెళ్తున్నప్పుడు
వీడ్కోలు చెబ్తూ కన్నీరెడ్తుంది
పల్లె ఙ్ఞాపకాలు తెచ్చే కన్నీటితో హృదయం బరువెక్కుతుంది
పల్లెపాటలు..ఎప్పటికీపాడుబడవనివై నాలో ఎన్నెన్నో రాగాలు...

- మల్లవరపు ప్రభాకరరావు
(1996)

Thursday, October 12, 2006

కూతురు: కోటి రత్నమ్మ

కొడుకు రాజేశ్వరరావు

అందరూ కవులే!

జాను కవి గారి భార్య,కొడుకు,కూతుర్లు...అందరూ కవులే!

జాన్ కవి వివరాలు!


జాను కవి గారు 2-1-1927 లో జన్మించారు. మల్లవరపు దావీదు,శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం! వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావు లు మంచి కవులు.ఒక మనవడు మంచి చిత్రకారుడు.జాను కవి గారు ది:12-08-2006 న మరణించారు.

Wednesday, October 04, 2006

mallavarapu john kavi rachallu!

డియర్ ఫ్రెండ్స్!
మల్లవరపు జాన్ కవి గారు తెలుగు పద్య కవులలో ఒకరు! అయన ఈమధ్య చనిపోయారు.ఆయన జ్ఞాపకార్ధం ఒక సాహిత్య సంచికను తీసుకొస్తున్నారు. కనుక ఆయనతొ మీకు గల అనుబంధాన్ని పంచుకోవాలంటె ఈ క్రింది చిరునామాకి మీ రచనలను పంపవలసినదిగా కోరుతున్నాం!
ఇట్లు
డా.దార్ల వెంకటెశ్వరరావు.
మల్లవరపు ప్రభాకర రావు. ]
మా మెయిల్స్
vrdarla@yahoo.com
prabhakararao_mallavarapu@yahoo.co.in